కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం
కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విధాన సౌధ తూర్పుద్వారం మెట్ల వద్ద ఏర్పాటు చేసిన భారీ వేదికపై ఆయనతో గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు, ప్రజలు హాజరయ్యారు. కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణ చేసుకున్న అనంతరం మిగతా మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 22 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించగా, డిప్యూటీ స్పీకర్ పదవిని జేడీఎస్‌కు ఇచ్చారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడువేల మందికిపైగా వీఐపీలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, రాస్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి తదితరులు హాజరయ్యారు.













