సొంత గూటికి మాజీ సీఎం కిరణ్!
సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నల్లారి కిరణ్ కుమార్రెడ్డి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఆయన తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలున్నట్లు కిరణ్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కేంద్రం పంపిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని తిప్పికొట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పి పార్టీ అధినేత సోనియా గాంధీపై సైద్ధాంతిక సమరం చేసిన కిరణ్ తరువాత కాంగ్రెస్కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీతో ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న కిరణ్ తిరిగి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో తనకు కాంగ్రెస్ పార్టీయే సరైనదనే నిర్ణయానికి వచ్చారని, విభజన అంశం తప్ప కాంగ్రెస్ నాయకత్వంతో ఎలాంటి విభేదాలు లేనందున ఆ పార్టీలో చేరేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని, పైగా తనకు కాంగ్రెస్ పార్టీయే సిఎంను చేసిందన్న విశ్వాసం కిరణ్లో ఇంకా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం కిరణ్తో మాట్లాడిందని సమాచారం. వచ్చే నెలలో ఆయనే దీనిపై స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కిరణ్కు ఎఐసిసిలో కీలక పదవి ఇస్తారనే హామీ లభించినట్లు కూడా తెలుస్తోంది.













