తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన కార్తీక మాసం
నేటి నుంచి పవిత్ర కార్తీకమాసం ప్రారంభమయింది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం ప్రారంభ సందడి కనిపిస్తోంది. భక్తులు నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలంలోని భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం, వేములవాడలోని రాజన్న ఆలయంతో పాటు ఇరు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అలాగే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మంజీరా నదీ తీరాల్లోని ప్రముఖ ఆలయాల్లో కార్తీక శోభ కనిపిస్తోంది. విజయవాడలో భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అలాగే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో భక్తుల రద్దీ పెరిగింది. గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు నదిలో, ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.













