2019లో బరిలో దిగుతాం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సర్వం సన్నద్ధం చేసుకుంటున్న జనసేన బలాబలాలకు అనుగుణంగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 294 స్థానాలు ఉండగా, ఆంధ్రాలో 175, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో పార్టీకి గట్టి పట్టు ఉంటుందని భావిస్తున్న నియోజకవర్గాలను గుర్తించారు. ప్రతి నియోజకవర్గంలో మిగిలిన పార్టీలు బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకోగా, జనసేన మాత్రం జిల్లా స్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియాలో ఉంది. అయినా ప్రజలు కోరుకుంటే కమిటీలతో సంబంధం లేకుండా గెలిచే అవకాశాలు ఉంటాయనే సిద్ధాంతాన్ని పార్టీ నమ్ముకున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 100 నుండి గరిష్టంగా 175 స్థానాలకు పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో చెరో 50 నియోజకవర్గాల్లో బలపడినా, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితి ఉంటుందని జనసేన భావిస్తోంది. ఖచ్చితంగా అన్ని సీట్లకూ పోటీచేస్తామని చెప్పి, అందుకు భిన్నంగా వ్యవహరించే బదులు ముందుగానే పార్టీ యంత్రాంగాన్ని కొన్ని సీట్లకే పోటీచేస్తామనే సందేశాన్ని ఇవ్వడం మంచిదనే యోచనలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉన్నట్లు తెలిసింది.













