9/11కు కొత్త అర్థం చెప్పిన ప్రధాని
స్వామి వివేకానందుడి ఆశయాల సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 (9/11)వ తేదీ అంటే అమెరికాపై ఉగ్రదాడి మాత్రమే గుర్తు చేసుకునేంటే, 125 ఏళ్ల క్రితం ఇదే రోజు (11/9/1893) చికాగోలో స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని యువ భారత్, నవ భారత్ నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ సెప్టెంబర్ 11 గురించి 2001 తర్వాతే ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలైంది. అమెరికాపై ఉగ్రదాడి జరిగిన సందర్భంగా ప్రజల్లో ఈ చర్చ ప్రారంభమైంది. అయితే అంతకంటే 125 ఏళ్ల క్రితం ఇదేరోజు ప్రేమ, సామరస్యం, సోదరభావాలకు ప్రతీకగా నిలిచింది. మీ వయసులోనే ఈ దేశం నుంచి ఓయువకుడు కాషాయ దుస్తులతో ఇదే రోజు చికాగోలో ప్రసంగించాడు. తన మాటలతోనే భారత దేశ గొప్పతనాన్ని చాటాడు. ప్రపంచం మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఐకమత్వానికి ఉన్న శక్తిని ప్రపంచ నలుమూలకు చాటాడు అని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు వివేకానందుడు భారత దేశ గొప్పతనాన్ని చాటారని, స్వదేశం పర్యటించినప్పుడు దేశంలోని సమస్యలను ప్రస్తావించారని గుర్తు చేశారు.













