మెరుగైన స్థితిలో ఎపి, తెలంగాణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. దాంతో చాలా అంశాల్లో ఇక్కడి పారిశ్రామిక వాతావరణం ఇతర చోట్లతో పోల్చుకుంటే మరింత మెరుగ్గా ఉంది. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. తాజాగా నీతిఆయోగ్, ఐడీఎఫ్సీలు సంయుక్తంగా నిర్వహించిన పారిశ్రామిక సర్వేలో కూడా చాలా అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు దేశంలోని టాప్ -5 లో నిలవడం విశేషం. ఇదివరకు ప్రపంచబ్యాంకు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాలు తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. వ్యవస్థీకృత ఉత్పాదక సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగగా ఆ ర్యాంకులు ఇచ్చారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా సర్వే నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంస్కరణలు వాస్తవంగా పనిచేస్తున్నాయా? వాటివల్ల పారిశ్రామికవేత్తలు నిజంగా లబ్ధి పొందుతున్నారా? అన్న అంశాలపై నీతిఆయోగ్, ఐడీఎఫ్సీలు న్యాయవాదులు, ఛార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల్లాంటి నిపుణులతో పాటు తయారీదారులు, స్టార్టప్స్ నుంచి అభిప్రాయాలు సేకరించారు. పరిశ్రమల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన సింగిల్విండో విధానం గురించి ఎంతమందికి అవగాహన ఉంది? కార్మికుల లభ్యత ఎలా ఉంది? భూములు, అనుమతుల కేటాయింపుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అంశంపై వివరాలు సేకరించారు.
సర్వేలా ఇలా సాగింది….
దేశవ్యాప్తంగా 3,726 ఉత్పాదక సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న 141 సంస్థల అభిప్రాయాలను కూడా సేకరించారు. 2016 లో జరిపిన ఈ సర్వేలో 23 రంగాలకు చెందిన సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.. సులభ వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలు ఎక్కడ విజయవంతమవుతున్నాయి? ఎక్కడ విఫలమవుతున్నాయనే విషయాలను వెలుగులోకి తెచ్చి తప్పులను సరిదిద్ది మరింత మెరుగైన పారిశ్రామిక వాతావరణం కల్పించడానికి వీలుగా ఈ సర్వే నిర్వహించారు.













