రూ.999కే విమాన ప్రయాణం
బడ్జెట్ విమానయాన కంపెనీ ఇండిగో ప్రయాణికుల కోసం భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 10 లక్షల విమాన టికెట్లను అమ్మే లక్ష్యంతో రూ.999ల అతి తక్కువ ప్రారంభ ధరతో టికెట్ల అమ్మకాలు ప్రారంభించింది. మొబైల్ వాలెట్ మొబిక్విక్ నుంచి దాదాపు రూ.600 నుంచి 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కూడా అందజేస్తున్నట్లు ప్రకటించంది. సెప్టెంబర్ 18 నుంచి 2019 మార్చి 30 మధ్య గడువులో ప్రయాణించేందుకు గానూ రూపొందించిన ఫెస్టివల్ సేల్‌ను నేడు ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అతి తక్కువ ధరలోనే విమాన టికెట్లను అందిస్తున్న కారణంగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నట్లు ఇండిగో ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ముందస్తు టికెట్ల అమ్మకాలతో మరిన్ని లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ 1.2 మిలియన్ల సీట్లను రూ.1212 ప్రారంభ ధరతో టికెట్లను ఇండిగో విక్రయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక రోజులో 52 గమ్యస్థానాలకు 1,100 విమనాలను ఇండిగో నడుపుతోంది.













