దేశమంతా దీపాలమయం…కరోనాపై పోరుకు ఒక్కటైన దేశం
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశమంతా ఆదివారం రాత్రి 9 నుంచి 9 నిముషాలపాటు దీపాలు వెలిగించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుకు దేశ ప్రజలంతా స్పందించారు. దేశమంతా దివ్యజోతులు వెలిగాయి. ప్రమిదలు.. కొవ్వొత్తులు.. టార్చ్లైట్లు.. మొబైల్ లైట్ల రూపంలో కోట్లాదిమంది మహాసంకల్పంతో ఆశాదీపాలను వెలిగించారు. కరోనా వైరస్ నుంచి కాపాడాలని వేడుకుంటూ దీపాలను వెలిగించారు. యావత్ భారత జాతి సమైక్యతను చాటేందుకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ మంతటా ప్రజలు తమ గ•హాలలో విద్యుత్ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. దీంతో యావద్భారతం దీప కాంతితో ధగధగలాడింది. రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించి కరోనాపై యుద్ధంలో గెలవాలన్న తమ ఆకాంక్షను చాటారు. దేశమంతా ప్రచండ దీప వెలుతురుతో స్పందించింది. దేశ ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి కరోనా బాధితులకు తాము అండగా ఉన్నామంటూ దిగ్విజయంగా దీపాలు, టార్చ్లైట్లు, మొబైల్ఫోన్ల లైట్లుతో తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పివేసి ఎవరికి నచ్చిన విధంగా వారు కొవ్వొత్తులు, టార్చ్లైట్లు, మొబైల్ ఫోన్ లైట్లు, మరికొంత మంది ప్రమిదలతో తన ఐక్యత భావాన్ని చాటారు. దేశ ప్రధాని నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రిటీల నుంచి ఆటగాళ్ల దాకా అందరూ పాల్గొన్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలంతా తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పివేసి కరోనాపై చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు.













