రూ.19 వేల కోట్ల నల్లధనం వెల్లడైంది : అరుణ్ జైట్లీ
నల్లధనం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ రూ.19 వేల కోట్ల నల్లధనాన్ని గుర్తించిందని చెప్పారు. అంతర్జాతీయంగా వివిధ సంస్థలు వెల్లడించిన సమాచారం ఆధారంగా దర్యాప్తును నిర్వహించినట్లు తెలిపారు.
ఐసీఐజే (ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్) సుమారు 700 మంది భారతీయుల విదేశీ ఖాతాల సమాచారాన్ని వెల్లడించిందని జైట్లీ లోక్‌సభకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా నిర్వహించిన దర్యాప్తులో రూ.11,010 కోట్లకు పైగా నల్లధనం వెల్లడైందన్నారు. 31 కేసుల్లో 72 ఫిర్యాదులను కోర్టుల్లో దాఖలు చేసినట్లు వివరించారు.
పనామా పేపర్స్ లీక్ చేసిన ఖాతాలు, మరికొందరు నల్లధనవంతులపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో మల్టీ ఏజెన్సీ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్ మన దేశానికి సమాచారం అందజేసిందని తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీలో 628 మంది భారతీయులు దాచిన సొమ్ము గురించి వివరాలు తెలియజేసిందని పేర్కొన్నారు.
ఈ కేసుల్లో పద్ధతి ప్రకారం జరిగిన దర్యాప్తులో అంతకుముందు వెల్లడించని రూ.8,437 కోట్ల ధనం 2017 మే నాటికి పన్ను పరిథిలోకి వచ్చిందని చెప్పారు. 162 కేసుల్లో కన్సీల్మెంట్ పెనాల్టీగా రూ.1,287 కోట్లు విధించినట్లు, 84 కేసుల్లో 199 క్రిమినల్ కంప్లయింట్లను దాఖలు చేసినట్లు వివరించారు.













