GST వలన సామాన్యులకు వరమే అంటున్నారు….
వినియోగం జరిగిన చివరి రాష్ట్రానికే పన్ను చేరుతుంది. ఈ రకంగా జీఎస్టీ గమ్యస్థాన ఆధారిత పన్నుగా గుర్తింపు పొందింది. పన్ను చెల్లించేవారు గతంలో లాగా ఎక్సైజ్, సేవాపన్ను, వ్యాట్, అమ్మకపు పన్ను, ఆక్ట్రాయి, ఎంట్రీ పన్ను, విలాస పన్ను, వినోద పన్ను మొదలైన వాటన్నంటికి రకరకాల రికార్డులను కొనసాగించవల్సిన అవసరం లేదు. వారు జీఎస్టీకి సంబంధించిన రికార్డులను తయారు చేసుకుంటే చాలు. కేంద్రానికి సంబంధించిన అయిదురకాల ఎక్సైజ్సుంకాలు, కస్టమ్స్, సేవాపన్ను, సర్ఛార్్జలు, సెస్‌లు, రాష్ట్రానికి సంబంధించిన వ్యాట్, కేంద్ర అమ్మకపు పన్ను, విలాస పన్ను, ఎంట్రీ టాక్స్, వినోదపు పన్ను, ప్రకటనల పన్ను, వినియోగ పన్ను, లాటరీల పన్ను, రాష్ట్ర సర్‌ఛార్జిలు, సెస్‌లు మొదలైనవన్నీ జీఎస్టీలో చేరిపోతాయి. మినహాయించిన వస్తు సేవలు కేంద్ర రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటాయి. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యంపై వచ్చే ఆదాయంపై సంప్రదింపులకు తావులేదని, వీటిని ప్రక్కనపెట్టాలని పలురాష్ట్రాలు వాదించడంతో విస్తృత రాజకీయ ఏకాభిప్రాయ సాధన కోసం వాటిపై జీఎస్టీని మినహాయించారు. భవిష్యత్ సంస్కరణల సమయంలో వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నది
జీఎస్టీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతుంది కనుక మానవ జోక్యం తగ్గిపోతుంది. వేగవంతమైన నిర్ణయాలకు వీలుకల్పిస్తుంది. భారత ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియాకు ఇది పెద్ద ఊతమిస్తుంది. దిగుమతయ్యే అన్ని వస్తువులకూ ఒకే సమష్టి పన్ను ఉంటుంది. ఇందులో కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ కలిసే ఉంటాయి. తద్వారా స్థానిక ఉత్పత్తులపై పన్నుల్లో అసమానతలుండవు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఎగుమతులు సాఫీగా సాగేందుకు నూతన జీఎస్టీ తోడ్పడుతుంది. గతంలో లాగా కేంద్ర రాష్ట్రాలు వేర్వేరుగా వసూలు చేసే పరోక్ష పన్నుల బెడద ఉండదు. జీఎస్టీ వల్ల పన్నుల ఎగవేతకు ఆస్కారం లేకుండా పోతుంది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. జీఎస్టీ వల్ల వినియోగదారులకు లభ్యమయ్యే వస్తు సేవల ధరలు తగ్గడమే కాక, కేంద్ర, రాష్ట్రాల రెవిన్యూలు కూడా మరో వైపు పెరుగుతాయి. వర్తక, వ్యాపార లావాదేవీలు సులభంగా మారుతాయి. అదనంగా లభించే ఆదాయం వల్ల బడ్జెట్ లోటును పూరించేందుకు వీలు కలుగుతుంది. ఈ మొత్తాన్ని పాఠశాలలు, రహదారుల నిర్మాణానికి ఉపయోగించవచ్చు. అనేక ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు.
జీఎస్టీ విషయంలో రాజకీయాలు చేయాలని కొందరు భావిస్తున్నారు. నిన్న టి వరకూ జీఎస్టీని అంగీకరించి ఇప్పుడు స్వల్ప కాలిక రాజకీయ ప్రయోజనాలకు వెనుకంజ వేస్తూ ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నారు. కాని ఈ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోగలరు. జీఎస్టీపై రాజకీయాలకు తావు లేదని, ఎందుకంటే జీఎస్టీ ఒక సమష్టి నిర్ణయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశంలోని తొలి ఫెడరల్ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్‌కు మాత్రమే దేశంలో పన్నుల రేట్లపై నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నదని, అందులో కేంద్రం ప్రమేయం ఏమాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పన్ను ఎగవేతదారులు, అక్రమాలకు పాల్పడే వారే జీఎస్టీ గురించి భయపడాలి. సామాన్య ప్రజలకు జీఎస్టీ వల్ల ప్రయోజనమే కాని నష్టం చేకూరదు.













