విదేశీ పర్యాటకులకు జీఎస్టీ వాపసు
భారత్లో పర్యటించడానికి వచ్చిన విదేశీ పర్యాటకులకు ఒకింత ఉపశమనం లభించనున్నది. దేశంలో కొనుగోలు చేసే వస్తువులపై పడే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తిరిగి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. రెవెన్యూ శాఖ ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. తొలుత అనుకున్న దాని ప్రకారం విమానాశ్రయాల్లోని పన్ను రహిత విక్రయశాలల్లో అంతర్జాతీయ ప్రయాణికులు కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ దేశాల తమ దేశంలో పర్యటించే వారికి వ్యాట్, జీఎస్టీలను తిరిగి చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో పర్యటించే వారికి జీఎస్టి నుంచి వినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే దీనిపై చర్చిస్తున్నారు. ఫేక్ బిల్లులపై ఎటువంటి వాపసూ లభించదు. కేవలం పెద్ద పెద్ద రిటైలర్లు ఇచ్చే బిల్లులపై విధించిన జీఎస్టీని తిరిగి చెల్లిస్తాం అని ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు.













