పాతనోట్లు మార్చుకునేందుకు మరో అవకాశం
బ్యాంకులు, పోస్టాఫీసులు, జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ నెల 30 లోగా ఆయా బ్యాంకులు, పోస్టాఫీసుల్లోని పాతనోట్లను రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలని, పాతనోట్ల విలువకు తగిన కొత్త నోట్లను తీసుకెళ్లాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్వర్వులను వెలువరించింది. నోట్లరద్దు సమయంలో సహకార బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఇబ్బడిముబ్బడిగా రద్దు నోట్లు పోటెత్తాయి. డీమానిటైజేషన్ జరిగి ఆరు నెలలు కావస్తున్నా, ఇప్పటికే కోట్లాది రూపాయల పాతనోట్లు సహకార బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు తిరస్కరిస్తుండడంతో రైతులకు రుణాలిచ్చేందుకు సరిపడా కొత్తనోట్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా సహకార బ్యాంకుల్లోని పాతనోట్లు మార్చుకునేందుకు కేంద్ర అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు.













