కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవుభత్యం (డీఏ) 4 శాతం పెరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ 21 శాతానికి చేరింది. జనవరి 1 నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. చివరిసారిగా గత అక్టోబరులో ఉద్యోగుల డీఏ పెరిగింది. అప్పుడు 5 శాతం పెంపుతో డీఏ 17 శాతానికి చేరింది. తాజా పెంపు కారణంగా ప్రభుత్వంపై రూ.14,595 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. డీఏ పెంపుతో 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు.













