మళ్లీ అమెరికాకు పారికర్
కాలేయ సంబంధిత సమస్యలతో (పాంక్రియాటైటిస్) కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో మూడు నెలల పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న పారికర్ గత జూన్‌లో గోవా తిరిగి వచ్చారు. అయితే ఈ నెల 22న ఆయన ఇండైజేషన్ కారణంగా వాంతులు చేసుకోవడంతో ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన ముంబై నుంచి గోవాకు తిరిగి రానున్నట్టు రెండ్రోజుల క్రితం గోవా సీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే లీలావతి ఆసుపత్రి వైద్యులు మాత్రం మరోసారి అమెరికాలో చికిత్స తీసుకోవాలని పారికర్‌కు సూచించారు. దీంతో ఆయన మరోసారి యూఎస్ వెళ్తున్నారు. న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో ఆయన చేరనున్నట్టు తెలుస్తోంది. కాగా, పారికల్ యూఎస్ పర్యటన సమాచారాన్ని కేబినెట్ మంత్రులకు సీఎంఓ తెలియజేసినట్టు గోవా మంత్రి రోహన్ కుంతే ధ్రువీకరించారు.













