ఐదేళ్లు కాదు… పదేళ్లు కావాలని అడిగారు : ఆజాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని బీజేపీ నేతలే అనాడు అడిగారు అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాంనబీ అజాద్ అన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చరిత్ర తెలిస్తేనే ఏపీ సమస్యలేంటో తెలుస్తాయని అన్నారు. ఏపీ ప్రజల మనోభావాలు తనకు తెలుసునని, ఆంధ్రప్రదేశ్‌తో తనకెంతో అనుబంధం ఉందన్నారు. తెలంగాణకున్న అవకాశాలు ఏపీకి లేవని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం ఎంత సమంజసమో, అలాగే ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం అంతే సమంజసమని అన్నారు.
ఏపీ ప్రజల సమస్యను సానుభూతితో చూడాలని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అన్నదని, ప్యాకేజీ కింద రూ.16 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ.400 కోట్లే ఇచ్చిందని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాలకు కేవలం రూ.1000 కోట్లే ఇచ్చిందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కనీసం రూ.10 వేల కోట్లు అవసరముండగా కేవలం రూ.1500 కోట్లే కేంద్రం ఇచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోదీ ఇచ్చిన మాట తప్పారని ఆయన విమర్శించారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్లాంట్ ఆచూకీ లేదని అన్నారు. సుప్రీంకోర్టులో మాత్రం విభజన హామీలన్నీ నెరవేర్చామని కేంద్రం అఫడవిట్ దాఖలు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం దేశాన్ని, పార్లమెంట్‌ను, ఏపీని మోసం చేస్తోందని దుయ్యబట్టారు.













