సామాన్యుడికి అందుబాటులో విమానం
గన్నవరం విమానాశ్రయం నుంచి నిత్యం 34 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి
దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, తిరుపతి, మంగుళూరు, త్రివేండ్రం నగరాలకు నేరుగా సర్వీసులున్నాయి. ఎయిరిండియా, అలయన్స్ ఎయిర్, ట్రూజెట్, స్పైస్‌జెట్ సంస్థలు సేవలందిస్తున్నాయి. జూమ్ ఎయిర్‌లైన్స్, ఇండిగో సంస్థలు నూతన సర్వీసుల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్‌కు మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటే తక్కువకే వెళ్లి రావచ్చు. పలు విమానయాన సంస్థలు రూ.699, రూ.1499లకు ఆఫర్లు ఇస్తున్నాయి.
మరోవైపు ఏ నగరానికైనా రూ.1000 వెచ్చిస్తే వెళ్లిపోవచ్చంటూ మరో సంస్థ ఆఫర్ ఇస్తూ సామాన్యులనూ ఆకర్షిస్తోంది. అంటే రైలు టిక్కెట్ ధరతో సమానమన్న మాట. విజయవాడ నుంచి బెంగళూరు రాకపోకలకు ఆదరణ భారీగా పెరిగింది. రోజూ మూడు సర్వీసులు ఇక్కడి నుంచి వెళుతుండగా, పూర్తిగా నిండిపోతున్నాయి. మరో సర్వీసు కోసం ఎయిర్ ఇండియా చూస్తోంది.
మూడు కారణాలతో దిగొచ్చింది
అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ఛార్జీలు భారీగా తగ్గడం.
విమానయాన సంస్థల మధ్య పోటీ పెరగడం.
ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కావడం.
లగ్జరీ కాదు..అవసరం
సమయం చాలా విలువైనదిగా మారిపోయింది. ఒకప్పుడు లగ్జరీ అనుకునే విమానం అవసరంగా మారిపోయింది. దానికి తగ్గట్టే ధరలు దిగి వచ్చాయి. రైలులో ఏసీ ఛార్జీకే విమానంలో టికెట్ దొరుకుతుండటంతో సామాన్యులు మొగ్గు చూపుతున్నారు. పర్యాటకంగా కుటుంబాలతో కలిసి వెళ్లాలనుకునే మధ్యతరగతి వారికి విమానాలు అందుబాటులో వచ్చాయి.













