ఆర్టీసి విభజనపై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ విభజనపై మూడేళ్లుగా సాగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ నెల 24వ తేదీన విజయవాడలో రెండు రాష్ట్రాల ఆర్టీసి పాలకమండళ్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్టీసి విభజన సాంకేతికంగా జరిగినా కేంద్రం అధికారికంగా రాజముద్ర వేయలేదు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత 2016లో ఇక్కడ ఉన్న బస్ భవన్ నుంచి ఏపిఎస్ఆర్టీసి విజయవాడకు తరలివెళ్లింది. కాగా హైదరాబాద్లో ఉన్న కొన్ని స్ధిరాస్తులు, భవనాల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. విజయవాడలో జరిగే ఆర్టీసి పాలక మండలి సమావేశంలో అనేక కీలకాంశాలపై తీర్మా నం చేయనున్నారు. ఈ తీర్మానాలను విభజన సాఫీగా జరిగేందుకు పర్యవేక్షణ కమిటీ షీలాబేడీ కమిటీకి, కేంద్రం, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు పంపించనున్నారు.













