తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హోరు
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల బాజా మోగించబోతున్నాయి. 18 నెలల ముందుగానే రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నాయి. చతురంగబలాలను సమీకరించుకుంటూ ముఖ్యనాయకులు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. అక్టోబరు నుంచి పాదయాత్రలకు నేను రెడీ అంటూ ముందస్తుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు వై.సి.పి. అధినేత జగన్. అదే నెల నుంచి జనసేనను ప్రజల్లోకి తీసుకెళతాను అంటున్నారు పవన్.
పార్టుటైమ్ పొలిటీషియన్ గా ముద్ర పడిన జనసేనాని సినిమాలను పక్కనపెట్టి మూడింట రెండువంతుల సమయాన్ని ఇక ప్రత్యక్షరాజకీయాలకే కేటాయిస్తానని స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెసు పని పడతాను అంటూ జిల్లాల వారీ పర్యటనల యోచనను బయటపెట్టారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాలికి చక్రాలు కట్టుకుని ఎప్పుడూ ఏదో ఊళ్లో తిరుగుతూనే ఉంటారు. మొత్తమ్మీద నాయకులు ఇకపై తమ కాలం ప్రచార కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. ప్రజల్లోకి నాయకులు రావడం మంచిదే. కానీ చెప్పిన పనికి, చేస్తున్నదానికి ఏ మాత్రం పొంతన లేకుండా భాషలోనూ, భావంలోనూ మరింత దిగువస్థాయి ప్రమాణాలే ఈసారి ప్రమాదాన్ని మోసుకొస్తున్నాయి. కుల,మత,ప్రాంతాల వారీ రెచ్చగొట్టగల వీరి ప్రచారం ఎటు దారితీస్తుందోనన్న ఆలోచన, ఆందోళన మేధోవర్గాలను బాధిస్తోంది. కాంగ్రెసు నేతలు, కమ్యూనిస్టు నాయకులను వ్యక్తిగతంగా కూడా కించపరిచే రీతిలో కేసీఆర్ తాజాగా ధ్వజమెత్తారు. ఇది ఈసారి ఎన్నికల ప్రచారంలో తీవ్రత ఏరకంగా ఉండబోతోందనేందుకు ఒక సంకేతంగా భావించాలి.
ఇక అటువైపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం , వై.సి.పిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడమే కాదు. ఇరుపార్టీలు ప్రత్యర్థుల తరహాలో కాకుండా ఆగర్భశత్రువులుగా చూసుకుంటున్నాయి. ఏ అవకాశం దొరికినా బురద చల్లుకుంటున్నాయి. ఎన్నికల సంగతి పక్కనపెడదాం. అసలు ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారంలోకి వచ్చిన ఆంద్రా, తెలంగాణా పార్టీలు ఇంతవరకూ అమలు చేసిన వాటి సంగతేమిటన్నది ప్రశ్నార్థకమవుతోంది. దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని స్పష్టంగా చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదు. భూమి అన్నది దళితుల ఆత్మాభిమానాన్ని పెంచుతుంది. ఆస్తికంటే సొంత భూమి ఉందన్న ఆత్మగౌరవం ఒక సామాజిక హోదాను కల్పిస్తుంది. ఇక పేదలకు రెండు పడకల ఇల్లు వంటి హామీలు కూడా ఆచరణకు నోచుకోలేదు. మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ వంటి పథకాలు సాగుతున్నాయని చెబుతున్నారు తప్ప ఫలితాలపై నిర్దిష్టమైన అంచనాలు చెప్పలేకపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు వివిధ రూపాల్లో న్యాయస్థానాల కేసుల్లో మగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ మేనిఫెస్టోల్లో పెట్టిన అంశాల అమలు అయోమయంగానే ఉంది.బాబు వస్తే జాబు, డోక్రా మహిళల రుణమాపీ ,అందులో ప్రత్యేకించి కాపుల రిజర్వేషన్లు అమలు చేయడం తలకు మించిన బారమే. ముద్రగడ చేపట్టిన పాదయాత్ర ఉద్యమాన్ని పోలీసు బలప్రయోగంతో ఆపడం రోజురోజుకీ ప్రభుత్వానికి సంకటంగా మారుతోంది. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకూ పట్టాలకెక్కలేదు. రాజధాని నిర్మాణం ఇంకా డిజైన్ల దశ లోనే కిందుమీదులవుతోంది. పోలవరం కి బదులు పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల మీద వేల కోట్ల రూపాయలు వెచ్చించడం విమర్శలకి తావిస్తోంది. రైతు రుణమాఫీ వడ్డీల దశలోనే ఉంది. పూర్తిస్థాయి సంత్రుప్తి కనిపించడం లేదు. అయినా మేము ఎన్నికలకు రెడీ.
ఈసారి ఎన్నికల్లో మాకు 140 సీట్లు ఖాయం అంటూ లోకేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష వై.సి.పి. కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ? అదికారం ఎలా చేజిక్కించుకోవాలన్న తాపత్రయం లో ఉన్నట్లుంది. రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలపై నిర్దిష్టమైన అవగాహనతో ప్రజల ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు గా కనిపించడం లేదు. ప్రధానంగా కాపుల రిజర్వేషన్ పై తమ వైఖరి ఏమిటి? ఇది సామాజిక అంశంగా రాష్ట్రాన్ని కొంత కాలంగా వేధిస్తోంది. దానితో పాటు తుందుర్రు , కులవివక్ష గరగపర్రు ,వీటిని ప్రతిపక్షాలు ట్రంప్ కార్డు గా వాడుకుంటూ ప్రదానపక్షం పైచేయి సాదించింది కొంతవరుకూ, రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా పై కేంద్రంతో పోరాటం ఇలా అనేక విషయాల్లో కప్పదాటు వైఖరి ప్రతిపక్షంలో కనిపిస్తోంది. కేవలం ఎన్నికలు, అధికారమే లక్ష్యంగా పార్టీలు కదం తొక్కేందుకు సిద్దమవుతున్నాయి. అజెండా లేదు. అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ కూడా లేదు. అందుకే ఓటర్లు కూడా మాకేమిస్తారనే ధోరణిలో ఈ సారి క్యాష్ పార్టీలను ఎన్ క్యాష్ చేసుకోవచ్చని ఎదురుచూస్తున్నారు.ఇక మీడియా సంగతికొస్తే వారికి ఈసారి పండగే పండగ ఎందుకంటే గత 2014 గోదాలో వుంది ప్రదానం గా రెండేపార్టీలు,ఇప్పుడు మూడు తప్పితే నాలుగు వుండచ్చు అంటున్న విశ్లేషకులు. 2014 లో కంటే 2019 న్యూస్ చానల్స్ లో అవకాశాలెక్కువుండచ్చు .













