పరిశ్రమల స్థాపనకు ‘వ్యాపార సౌలభ్యం’ ఊతం
పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్) విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం కింద ప్రభుత్వం కల్పిస్తున్న వౌలిక సదుపాయాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను పారిశ్రామిక వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమల స్థాపనకై స్నేహపూర్వక వాతావరణం, సదుపాయాలను కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సదస్సుల నిర్వహణ, పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు. పరిశ్రమల ప్రోత్సాహంలో వివిధ దేశాలు అనుసరిస్తోన్న విధానాలకు ప్రపంచ బ్యాంక్ ఏటా ర్యాంకులు అందజేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాలకు ఈ ర్యాంకులను జారీ చేస్తున్నారు. ఈ ర్యాంకింగ్ విధానంలో భారత్ 120వ స్థానంలో ఉంది. రానున్న కాలంలో తొలి 100 ర్యాంకుల్లో నిలిచే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో పారిశ్రామిక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం కింద సరళీకృత పారిశ్రామిక విధానాలను అమలుచేస్తున్నారు. 31 ప్రభుత్వ శాఖలు జారీచేసే అనుమతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు, ముడి సరుకుల కేటాయింపు తదితర సేవలను ఒకే ఒక్క దరఖాస్తు కింద (సింగిల్ విండో విధానం) జారీకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ ఏకగవాక్ష విధానం ద్వారా సకాలంలో అన్ని రకాల అనుమతులను ఒకేసారి ఇవ్వడం ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ విధానాన్ని 2015 నుంచి ప్రభుత్వం అమలుచేస్తోంది. పరిశ్రమల స్థాపనకు ఆశించిన స్థాయిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చేందుకు గల ప్రతి అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.













