10 కాదు…. 13 అంకెలుంటాయ్
వినియోగదారులకు మరింత భద్రత కల్పించేందుకు టెలికాం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత ఎం2ఎం (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు ఇకనుండి 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెలు నంబరుకు మార్చుకోవాలని సూచించింది. డిసెంబర్ 31 నాటికి మార్చుకునే గడువు ముగుస్తుందని తెలిపింది. కాగా, 2018 జనవరి 8న టెలికాం శాఖ నుండి తమకు ఆదేశాలందాయని, దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని బిఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ విషయాన్ని టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కూడా ధ్రువీకరించింది. మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌లో స్పెక్ట్రమ్, రోమింగ్, క్యూవోఎస్‌కు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రారుకు లిఖిత పూర్వకంగా స్పందన తెలిపింది. టెలికాం శాఖ సిమ్ ఆధారిత ఎం2ఎం డివైజ్‌ల కోసం 13 అంకెల నంబరింగ్ సిరీస్‌ను ఆమోదించిందనీ, ఇప్పటికే చలామణిలో ఉన్న 10 అంకెల నంబర్ పనిచేసే విధంగా కొత్త నంబరింగ్ విధానం ఉంటుందని వెల్లడించింది. కొత్తగా సిమ్‌లు తీసుకున్న వారికి జులై నుంచే 13 అంకెల నంబరును కేటాయించనున్నారు.













