5 రూపాయలకే ప్రధాని మోదీని కలిసే అవకాశం
రిఫరల్ కోడ్ తో ఈ-కామర్స్, ట్రావెల్ వెబ్సైట్లలో డిస్కౌంట్లు పొందవచ్చు. కానీ, ఒక రిఫరల్ కోడ్, దేశ ప్రధానిని కలిసే అవకాశం ఇస్తోంది. ప్రధాని మోదీకి చెందిన నమో యాప్ ద్వారా ఈ చాన్స్ కొట్టేయొచ్చు. యాప్ తెరిచి అందులో బీజేపీకి రూ.5 నుంచి రూ.1000 లోపు విరాళం అందజేస్తే ఒక రిఫరల్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ను ఈ-మెయిల్, మెసేజ్, వాట్సాప్ ద్వారా స్నేహితులకు, తోటివారికి పంపి విరాళం ఇచ్చేలా ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఆలా ఆ కోడ్ను వాడి వంద మంది విరాళాలు అందజేస్తే స్వయంగా మోదీని కలిసే అవకాశం వస్తుందట. కనీసం పది మంది విరాళం ఇస్తే నమో టీషర్టులు, కాఫీ మగ్లు గెలుచుకోవచ్చు. సామాన్య ప్రజలు-ప్రధాని మోదీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ప్రయత్నం చేశామని బీజేపీ సీనియర్ నేత వెల్లడించారు.













