అమెరికా ఒత్తిడికి లొంగొద్దు
భారతదేశ ఆర్థిక వ్వవస్థ ద్వారాలను మరింత బార్లా తెరవాలన్న అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతోందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. తాము అమెరికా అజెండాను వ్యతిరేకించి తీరుతామని సృష్టం చేశాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ద్వారాలను మరింతగా తెరిపించడం, వాణిజ్య అడ్డంకులను తొలగించడం, అమెరికా రక్షణ ఉత్పత్తులను భారత్కు అమ్ముకోవడం వంటి లక్ష్యాలతోనే అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైక్ పాంపియో భారత్ పర్యటనకు వస్తున్నారని వామపక్ష పార్టీలు ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ట్రేడ్ ప్రోగ్రాంలో భారత్కు ఉన్న లబ్ధిదారు హోదాను రద్దు చేసిన అనంతరం ఈ పర్యటన చోటుచేసుకుంటోంది. హోదా రద్దు వల్ల అమెరికాలో భారత వస్తువులకు (కొన్నింటికి) సుంకాల మినహాయింపు ఉండదు. మరోవైపు ఇరాన్, వెనెజువెలా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలు చేసే అమెరికా ఆంక్షలు విధించే ముప్పు పొంచి ఉంది అని ఆ ప్రకటన వివరించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో పాంపియో భారత్లో పర్యటించనున్నారు. తన ఆదేశాలను పాటించని దేశాలపై కొత్త ఆంక్షలు విధిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అమెరికా యంత్రాంగం బెదిరిస్తోందని ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. క్యూబా, వెనెజువెలా, ఇరాన్, నికరాగువా తదితర దేశాల్లో ప్రభుత్వాలు మారేలా చేస్తూ ఆ దేశాల గొంతును నులిమేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీపీఐ, సీపీఎం, సీపీఐ లిబరేషన్, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశాయి.













