బాబా రామ్ రహీంను తప్పించే యత్నాలు..? బాబా సెక్యూరిటీ పోలీసుల అరెస్టు
డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా రామ్ రహీం గుర్మీత్ సింగ్ తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. బాబాను వేరే ప్రాంతానికి అక్రమంగా తరలించేందుకు యత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన దోషి అని కోర్టు శుక్రవారం తీర్పు చెప్పిన వెంటనే ఆయనను హర్యానా పోలీసు స్పెషల్ టీమ్ రోహ్తక్ జైలుకు తరలించింది. స్కార్పియో వాహనంలో ఆయనను తీసుకెళ్ళి హెలికాప్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించిన సమయంలో ఆయనను వేరే ప్రాంతానికి పంపించేందుకు కొందరు ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. జామర్ అమర్చిన వాహనంలో ఉన్న ఏడుగురు పోలీసులు ఓ ఐజీ స్థాయి అధికారిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలోనే రామ్ రహీంను హెలికాప్టర్లో రోహ్తక్ జైలుకు తరలించారు.
రామ్ రహీంకు ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సెక్యూరిటీ సిబ్బందిలోని ఏడుగురు హర్యానా పోలీసులు బాబాను జైలుకు తీసుకెళ్ళనివ్వబోమంటూ గందరగోళం సృష్టించినట్లు ఏఎస్ఐ రమేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. బాబాను తాము స్కార్పియోలో హెలికాప్టర్ వద్దకు తీసుకెళ్తూండగా, కమాండో దుస్తులు ధరించిన ఇద్దరు తమపై దాడి చేశారని ఆరోపించారు. స్కార్పియో వాహనానికి ఇరువైపులా ఆ ఇద్దరూ వచ్చారని, ఫాదర్‌ను తీసుకెళ్ళనివ్వబోమని మొరాయించారని, కారును స్టార్ట్ చేసి, ఈ పోలీసులను తొక్కిపడేయండి అని అరిచారని ఆరోపించారు. జామర్ వాహనం డ్రైవర్ తమను ఢీకొనడానికి ప్రయత్నించాడని, అదే సమయంలో తాము కారును రివర్స్ తీసుకుని, వారిని అదుపు చేయగలిగామని పేర్కొన్నారు.
నిందితులను విచారించినపుడు వారు డేరా ఫాలోవర్లని తెలిసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. వారి వద్దనున్న ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదైనట్లు హర్యానా డీజీపీ బీ ఎస్ సంధు కూడా ధ్రువీకరించారు. విధులకు ఆటంకం కలిగించిన జడ్ ప్లస్ సెక్యూరిటీలోని ఏడుగురు పోలీసులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. మేరకు వీరిపై హత్యాయత్నం, ఆయుధాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. వీరికి శనివారం ఏడు రోజుల పోలీస్ రిమాండ్ విధించారు. వీరు సుమారు ఏడేళ్ళ నుంచి రామ్ రహీమ్‌కు భద్రత కల్పిస్తున్న బృందంలో పనిచేస్తున్నారు. వీరి పూర్వాపరాల గురించి ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విధంగా ఆటంకం కలిగించేందుకు వారిని ఎవరైనా ప్రోత్సహించారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.













