దావూద్ ఇబ్రహీం సోదరుడి అరెస్టు
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కష్కర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ దోపిడీ కేసులో హస్తమున్నట్టు భావిస్తున్న ఇతడిని థానే క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. సెంట్రల్ ముంబైలోని నాగ్‌పడ ప్రాంతంలో ఇక్బాల్ నివసిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు, దోపిడి వ్యతిరేక సెల్ సీనియర్ అధికారి ప్రదీప్ శర్మ నేతృత్వంలో అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు… పక్కా పథకం ప్రకారం అరెస్టు చేసి తరలించారు. ”దోపిడీ కేసులో హస్తమున్నట్టు ఇక్బాల్‌పై ఆరోపణలు రావడంతో అతడిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నాం. విచారణ తర్వాత ఈ కేసులో అతడి పాత్ర ఉన్నట్టు తేలడంతో అరెస్టు చేశాం…” అని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
ఇటీవల థానేలోని ఓ వ్యాపారవేత్తకు ఇక్బాల్ పేరిట ఫోన్లు చేస్తూ బెదిరింపులు వచ్చాయి. ఆయన థానే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ముంబై ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన రెండు భవనాలను ఖాళీ చేయాలంటూ ఇక్బాల్‌కు ఇటీవలే అధికారుల నుంచి నోటీసులు అందాయి. 2003లో యూఏఈ నుంచి భారత్ వచ్చిన ఇక్బాల్… ప్రస్తుతం ముంబైలోని దావూద్ రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారాలు చూస్తున్నట్టు సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. సారా-సహారా షాపింగ్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణం కేసుతో పాటు ఓ హత్య కేసులో ఇక్బాల్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ రెండు కేసుల నుంచి 2007లో ఇతడికి విముక్తి లభించింది. కాగా ఇతడిని అరెస్టు చేసిన పోలీసు అధికారి శర్మ… లక్కాన్ భయ్యాను ఎన్కౌంటర్ చేసినందుకు సస్పెండ్ అయ్యారు. ఇటీవలే మళ్లీ విధుల్లో చేరిన ఆయన.. ఇక్బాల్ అరెస్టులో కీలక పాత్ర పోషించడం విశేషం.













