సురవరం స్థానంలో రాజా
సీపీఐ జాతీయ నూతన కార్యదర్శిగా డి రాజా (70) ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సురవరం సుధాకర్‌రెడ్డి వైదొలగడంతో ఆయన స్థానంలో రాజాను నియమిస్తూ పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో నిర్ణయించారు. తమిళనాడుకు చెందిన రాజా యువజన ఉద్యమాల నుండి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. తమిళనాడులో పలు ఉద్యమాలకు నేతృత్వం వహించారు. 1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నేతగా ఆయన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఎస్సీల సమస్యలపై రాజా ఎలుగెత్తారు. సురవరం సుధాకర్‌రెడ్డి 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మూడో పర్యాయం బాధ్యతలు నిర్వర్తిస్తుండగా అనారోగ్యం పాలవడంతో ఆయన ఆ పదవికీ రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన పదవీ కాలం 2021 వరకూ ఉంది. ఆరోగ్య రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో రెండేళ్ళ ముందే బాధ్యతల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.













