ఏచూరికే మళ్లీ అవకాశం?
రాజకీయ తీర్మానం కీలకమైన సవరణలతో ఆమోదం పొందిన నేపథ్యంలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరో దఫా ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శిగా మూడు దఫాలు పని చేయడానికి అవకాశం ఉంది. ఈయన ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం కేంద్ర కమిటిలో మైనార్టీలో పడటం, ఇదే రాజకీయ వ్యూహాన్ని ఆయన మహాసభ ముందుకు కూడా ప్రవేశపెట్టడంతో దీనికి ఆమోదం లభించకపోయినా, మెజార్టీ కేంద్ర కమిటీ ఆమోదించిన రాజకీయ తీర్మానంలోని కీలక అంశాలు అలాగే ఉన్నా ఏచూరి రెండోసారి కొనసాగకపోవచ్చనే ప్రచారం జరిగింది. ప్రత్యామ్నాయ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే చివరకు రాజకీయ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో ఏచూరే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నా, తుది నిర్ణయం మాత్రం కొత్తగా ఎన్నికయ్యే కేంద్ర కమిటీ తీసుకుంటుంది.













