కార్పొరేట్ల నజరానా
కార్పొరేట్ సంస్థల నుంచి అధిక మొత్తంలో నిధులు దండుకోవడంలో బిజెపి సరికొత్త రికార్డు సృష్టించింది. 2016-17 సంవత్సరంలో కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చిన రూ.419 కోట్ల విరాళాల్లో 83శాతం అంటే రూ.287.69 కోట్లు ఒక్క బిజెపికే దక్కాయని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) తెలిపింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు దానికి దక్కిన నజరానా అది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) వద్ద నమోదయిన 21 ఎలక్టొరల్ ట్రస్టులు, ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించే డిక్లరేషన్ల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక.. కార్పొరేట్ సంస్థలు రాజకీయ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు విరాళాలను ఒక సాధనంగా ఎలా వాడుకుంటున్నదీ, అవి విదిల్చే నిధుల కోసం బిజెపి, కాంగ్రెస్ లాంటి పాలకవర్గ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎలా పోటీ పడుతున్నదీ పూసగుచ్చినట్లు వివరించింది. రాజకీయ పార్టీలకు నిధుల లభ్యతపై పారదర్శకత, స్వచ్ఛత ఉండాలని గంభీరమైన ప్రకటనలు చేసే బిజెపి కపట వైఖరిని ఎడిఆర్ నివేదిక కళ్లకు కట్టింది. ఇది ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితమనుకుంటే పొరపాటు. గత నాలుగేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతూ వస్తోంది. బిజెపికి ముడుతున్న ఈ నిధుల్లో చాలా వరకు రియల్ ఎస్టేట్, మైనింగ్, చమురు, విద్యుత్, కన్స్ట్రక్షన్, మ్యానుఫాక్చరింగ్ వంటి రంగాల నుంచి వచ్చినవే. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ద్వారా కాంట్రాక్టులను, ప్రజల ఆస్తులను, సహజ వనరులను కారుచౌకగా కొట్టేయడం కోసం అవి చెల్లించుకునే ముడుపులకు మరో పేరే ఈ విరాళాలు!
కార్పొరేట్ సంస్థలకూ, మోడీ ప్రభుత్వానికీ మధ్య పెనవేసుకుపోయిన అపవిత్ర పొత్తుకు ఈ ఉదంతం ఒక తిరుగులేని తార్కాణం. ఈ పొత్తును మరింత పటిష్టపరచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ఎన్నికల బాండ్ల స్కీమ్ పేరుతో ఓ సరికొత్త అంకానికి తెర తీశారు. అధికారంలో వున్న బిజెపికి కార్పొరేట్ నిధులు దండిగా సమకూర్చేందుకు, రాజకీయ వ్యవస్థను కుబేరులు టేకోవర్ చేసేందుకు తప్ప ఈ ఎలక్టొరల్ బాండ్ స్కీమ్ మరి దేనికీ పనికిరాదు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రామిసరీ నోట్ తరహాలో వుండే ఈ ఎన్నికల బాండ్లను ఎంపిక చేసిన ఎస్బిఐ బ్రాంచీల్లో అమ్మకానికి పెడతారు. వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల విలువ కలిగిన ఈ బాండ్లను కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు విరాళంగా అందజేస్తాయి. వాటిని ఆ పార్టీలు తమ అకౌంట్లో వేసుకుని నగదుగా మార్చుకుంటాయి.
ఈ బాండ్లను ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుండి వచ్చాయి అన్న వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించనక్కర్లేదు. దర్యాప్తు సంస్థలూ దీనిని ప్రశ్నించడానికి వీల్లేదు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ల నిధుల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమైనప్పుడు ఆ బాండ్లను ఇచ్చిన వారి పేర్లు ఎందుకు బయటపెట్టరు? బాండ్లను ఎవరిచ్చారో ప్రజలకు తెలియక పోవచ్చు గానీ అధికారంలో ఉన్న పార్టీకి తెలియకుండా ఉండదు. అందువల్ల ప్రతిపక్ష పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా కార్పొరేట్లను ప్రభుత్వం బెదిరించేదుకు కూడా ఈ కొత్త బిల్లు వల్ల అవకాశం ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వల్ల అదికార పార్టీకి లాభం చేకూరుతుంది. ఎన్నికల్లో అది విపరీతంగా డబ్బు ఖర్చు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
దేశీయ కార్పొరేట్ సంస్థలే కాకుండా, విదేశీ కార్పొరేట్ సంస్థలు సైతం రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు వీలుగా ఎఫ్సిఆర్ఎ చట్టానికి సవరణలు చేపడుతున్నది. విదేశీ కంపెనీలు భారత్లోని తమ అనుబంధ సంస్థల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు ముట్టజెప్పడానికి ఇది వీలుకల్పిస్తున్నది. ఆయుధాలు, విమానాలు వంటి భారీ కొనుగోళ్లలో క్విడ్ ప్రోకో వంటి పద్ధతులకు ఈ సవరణల ద్వారా చట్టబద్ధత కల్పించాలని చూస్తున్నది. భారీ కాంట్రాక్టు పొందేవారు అధికారంలో వున్న పార్టీకి పది శాతం ముడుపులు రూపంలో సమర్పించుకోవడం ఇప్పటివరకు గోప్యంగా జరుగుతోంది. ఇక నుంచి చట్టబద్ధంగానే అటువంటివి సాగించవచ్చు. ఇందుకు అడ్డంకిగా వున్న ప్రజాప్రాతినిధ్య చట్టం, ఆర్బిఐ చట్టం, ఆదాయపు పన్ను చట్టాల్లోని నిబంధనలను తొలగించేందుకు ఈ ప్రభుత్వం పూనుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ శక్తుల నిధుల్లో 80 శాతం పైన దండుకుంటున్న బిజెపి ఎఫ్సిఆర్ఎ చట్టానికి సవరణలు జరిగితే మరిన్ని నిధులు కైంకర్యం చేస్తుంది. ఈ నిధులను ఎన్నికల్లో గెలవడానికే కాదు ప్రతిపక్షాలను లొంగదీసుకోడానికీ, సంఘపరివార్ ప్రాజెక్టులకు కూడా ఉపయోగపెట్టుకునే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం.













