123 రాజ్యాంగ సవరణ బిల్లు
ప్రస్తుత 123 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఆయా రాష్ట్రాల బీసీ కమిషన్లు కులాల చేర్పులు, మార్పుల విషయంలో తమ నివేదికను గవర్నర్‌కు సమర్పించాలి. ఆయా సిఫారసులను గవర్నర్ కేంద్రానికి పంపుతారు. అప్పుడు కేంద్రం మొదటగా ఆమోదం నిమిత్తం జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్‌కు పంపుతుంది. అలా పంపించిన జాబితా లేదా సిఫార్సులు ఆర్జిఐ రెండుసార్లు తిరస్కరించిన యెడల అది శాశ్వతంగా ఆమోదానికి నోచుకోకుండా పోతుంది. ఎస్సీల అంశంలో ఆర్జిఐ వద్ద పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. అదే బీసీలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండే అవకాశమే లేదు. పలు రాష్ట్రాల్లో బీసీలుగా గుర్తించబడిన కులాలు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీల జాబితాలో ఉన్నాయి. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడం సులువు కాదు. 1993 జాతీయ బీసీ కమిషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బిల్లు 70/2017తో ఉపసంహరించడం ద్వారా ఇప్పటివరకు ఆ చట్టం ప్రకారం బీసీ కమిషన్లకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పీరియాడికల్ రివిజన్ చేసే అధికారం ఉండేది.
ప్రస్తుత 123వ రాజ్యాంగ సవరణ బిల్లులో పొందుపరిచిన సెక్షన్ 3(9) ప్రకారం పరిశీలించినట్లయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యున్నతికి తీసుకునే అన్ని ప్రధాన నిర్ణయాల విషయంలో జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది.













