సన్ నెట్ వర్క్ వారి కన్నడ చానల్ ఉదయ న్యూస్ మూసివేత
73 మంది ఉద్యోగులకు ఉద్వాసన
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఇవ్వాల్సిన నోటీసును కూడా కర్నాటక ప్రభుత్వానికి పంపింది. మూసివేతలో భాగంగా 73 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అందులో వెల్లడించింది.
ఆ నోటీసుకు అనుబంధంగా జతచేసిన కారణాల జాబితాలో నష్టాలగురించి ప్రస్తావించారు. 19 ఏళ్ళుగా కన్నడ న్యూస్ కోసం భారీగా పెట్టుబడిపెట్టి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చినప్పటికీ గత రెండేళ్లలో నష్టాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. గట్టి పోటీ మధ్య ప్రేక్షకాదరణ కూడా బాగా తక్కువగా ఉందని, అది ఇటీవల మరింత దిగజారిందని వివరించారు. ఈ విధమైన వ్యాపార కారణాల రీత్యా పేరుకుపోతున్న నష్టాలు భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో మూసివేత నిర్ణయం తీసుకున్నామన్నారు.
దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ సన్ నెట్ వర్క్ కు న్యూస్ చానల్స్ ఉండగా మొదటగా ఉదయ న్యూస్ మీద వేటు పడింది.రెండొవది తెలుగు ఛానల్ అదేకోవలో వున్నాదని సంకేతాలు వున్నాయి . ప్రేక్షకాదరణ దృష్ట్యా చూస్తే అదే క్రమంలో ఉన్న తెలుగు న్యూస్ చానల్ లో జెమిని న్యూస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే భయాందోళనలు మొదలయ్యాయి. లాభ నష్టాలను బేరీజు వేసుకునే క్రమంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామనే సంకేతాలు పంపిన సన్ నెట్ వర్క్ వైఖరి ఎలా ఉండబోతుందో చూడాలి.













