అమెరికా మాదిరిగా మనం కూడా గోడ నిర్మిద్దాం
పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం దేశ ప్రజలను కలచివేసింది. అదే సమయంలో, పాక్పై ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో లుధియానా కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. పాక్తో ఉన్న సంబంధాలు అన్నింటినీ తెంచుకోవాలని ఆయన సూచించారు. టెర్రరిస్టులకు తగిణ గుణపాఠం చెప్పినప్పుడే వీర మరణం పొందిన సైనికులకు నిజమైన నివాళి అని ఆయన అన్నారు. అయితే, ఈ సందర్భంలోనే ఆయన ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అక్రమ వలసదారులను అరికట్టడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా-మెక్సికో సరిహద్దులో భారీ రక్షణ గోడ నిర్మించాలని భావించినట్టే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడకుండా ఇండో-పాక్ సరిహద్దులో మనం కూడా ఓ భారీ గోడను నిర్మించాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమని, అలాంటి దేశంతో ఇండియాకు ఎలాంటి సంబంధాలూ అక్కరలేదని రవ్నీత్ సింగ్ వ్యాఖ్యానించారు.













