పెట్రోధరలపై భారత్ బంద్
రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, వామపక్షపార్టీలు సోమవారం (సెప్టెంబర్ 10) భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సగటు వాహనదారుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. మరోవైపు నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయి. శుక్రవారం దాదాపు 50 పైసల వరకు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు 79.99, డీజిల్ 72.09 రూపాయలకు చేరింది. గత నెల రోజులుగా డీజిల్ ధర 4 రూపాయలు, పెట్రోలు ధర 3 రూపాయలు వరకు పెరిగింది. దానికితోడు ఈ ధరల పెరుగుదలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఆర్థికశాఖ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ ఫలాలు దేశవాసులకు అందించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌శర్మ విమర్శించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించకుండా ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఈ బంద్‌కు అందరూ సహకరించాలని ఆయన కోరారు.













