జైట్లీ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యంతో కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. అరుణ్‌జైట్లీ (66) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జైట్లీ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని జగన్ ట్వీట్ చేశారు. జైట్లీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.













