సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరో తెలుసా?
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పదవీ కాలం అక్టోబర్ 2తో ముగుస్తుండటంతో కొత్తగా నియమితులయ్యే చీఫ్ జస్టిస్ ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చ నడుస్తుండగానే దీపక్ మిశ్రా కేంద్రానికి సుప్రీం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించాలనే అంశంపై లేఖ రాశారు. జస్టిస్ రంజన్ గొగోయే పేరును ఆయన ప్రతిపాదించారు. సుప్రీం కోర్టులో కేసులు కేటాయింపు విషయంలో ప్రధాన న్యాయమూర్తి వివక్ష చూపుతున్నారని మీడియా ముందుకొచ్చి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసిన నలుగురు న్యాయమూర్తుల్లో గొగోయే ఒకరు కావడం విశేషం. దీపక్ మిశ్రా ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిదే అక్టోబర్ 3న రాష్ట్రపతి సమక్షంలో గొగోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 2న చీఫ్ జస్టిస్ బాధ్యతల నుంచి దీపక్ మిశ్రా రిటైర్ కావాల్సి ఉంది. అయితే ఆ రోజు గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినం కావడంతో అక్టోబర్ 1వ తేదీనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.













