చైనా మీడియా : యుద్ధానికి సిద్ధం అంటూ రాతలు
చైనీస్ అధికార మీడియా మరోసారి ఇండియాను హెచ్చరించింది. చైనాతో వివాదంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలన్నింటిలో యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనాతో భారత్కు ఉన్న 3500 కిలోమీటర్ల సరిహద్దులో కొత్త వివాదాలకు తెరతీస్తామని కూడా చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసింది. డోక్లామ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా టిబెట్ సరిహద్దులో నిర్వహించిన మిలిటరీ డ్రిల్ తర్వాత ఆ పత్రిక ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇండియాతో యుద్ధానికి చైనా భయపడటం లేదని, యుద్ధానికి కూడా తాము సిద్ధమని స్పష్టం చేసింది. భారత బలగాలు వెనక్కి వెళ్తేనే చర్చలు ఉంటాయని ఇప్పటికే చైనా స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఇండియా, భూటాన్, చైనా ట్రైజంక్షన్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించడాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకున్నది. నెల రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్ర భద్రతా సమస్యలు ఎదురవుతాయని భారత్ వాదిస్తున్నది. ఈ సరిహద్దు సమస్యపై ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు జారీ చేసిన గ్లోబల్ టైమ్స్ పత్రిక.. తాజాగా యుద్ధం మాట ఎత్తడం గమనార్హం.













