ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి : చంద్రబాబు
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్లారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తొలిసారిగా మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో చంద్రబాబు బెంగళూరులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌కు ప్రాంతీయ పార్టీలన్నీ అండగా ఉంటాయన్నారు. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా బీజేపీయేతర శక్తులు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేస్తామని అన్నారు.













