ఎన్నారైల ఓటింగ్ హక్కులపై బిల్లు
ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) పోస్టల్ లేదా ఈ-బ్యాలట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించే బిల్లును ప్రభుత్వం శీతాకాల సమావేశాలలో తీసుకురానున్నది. సుప్రీంకోర్టుకు శుక్రవారం కేంద్రం ఈ విషయం తెలియజేసింది. కేంద్రం తరపున హాజరైన న్యాయవాది పీకే డే ఇచ్చిన సమాధానాన్ని సీజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఎన్నారైల ఓటింగ్ హక్కులకు సంబంధించిన పిటిషన్పై విచారణను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వ లాయర్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉన్నందున విచారణను ఆరు నెలలపాటు వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వ లాయర్ కోరగా, 12 వారాలు మాత్రమే వాయిదాకు ధర్మాసనం అంగీకరించింది.













