50 లక్షలకు మించితేనే సుప్రీంకు
తాను పార్టీగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల కంటే తక్కువ మొత్తం చెల్లించాల్సి ఆర్థిక సంబంధమైన కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించకూడదని భావిస్తోంది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.10 లక్షలుగా ఉంది. దీనిని ఐదు రెట్లు పెంచడం ద్వారా తనకు వ్యతిరేకంగా ఉన్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన కేసుల్లో హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. తాజాగా ప్రతిపాదన అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు రూ.50 లక్షలకు మించి కేసుల్లోనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ రకమైన కేసులు ఎక్కువగా ఆదాయపు పన్ను శాఖ, తపాలా విభాగం, రక్షణ, రైల్వే శాఖల్లో ఎక్కువగా ఉన్నాయి.













