ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు శుభవార్త
కోవిడ్ 19 కారణంగా ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది. విదేశీయుల వీసా గడువును పొడిగించింది. విదేశీయుల వీసాల చెల్లుబాటును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తరువులిచ్చింది. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఇ-వీసా లేదా స్టే నిబంధనలను 30.04.2020 (అర్ధరాత్రి) వరకు పొడిగించినట్టు తెలిపింది. అటువంటి విదేశీ పౌరుల వీసాలను ఎలాంటి జరిమానా లేకుండా ఉచితంగా ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అలాగే ఇతర దేశాలకు రాకపోకలను కూడా నిషేధించిన సంగతి విదితమే.













