గుడ్ న్యూస్: కనీస వేతనం రూ. 21 వేలు
ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలను పెంచే ప్రయత్నాల్లో మోడీ సర్కారు ఉన్నట్లు సమాచారం. ఏడో వేతన సంఘం నివేదిక ప్రకారం కనీస వేతనాన్ని రూ. 21 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కింది స్థాయి ఉద్యోగులకు అందిస్తోన్న కనీస వేతనం రూ. 18 వేలు ఉండగా.. మరో మూడు వేల రూపాయలు పెంచున్ననట్లు తెలుస్తోంది. మరోవైపు కనీస వేతనాన్ని రూ. 25 వేలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఏడో వేతన సంఘం సిఫారసులకు కొన్ని మార్పులు చేసిన కేబినెట్ గత జూన్ లో ఆమోదం తెలిపింది. అప్పుడే కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచింది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరనుంది. జూలై 1 నుంచి వేతన సంఘం సిఫారసుల ప్రకారం పెంచిన అలవెన్సులు అమల్లోకి వచ్చాయి. ఉద్యోగ సంఘాలు 3.68 ఫిట్మెంట్ను డిమాండ్ చేస్తుండగా..మొదట 2.7 ఫిట్మెంట్కు అంగీకరించిన కేంద్రం దాన్ని 3కు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.













