ఒంటెపాలు లీటర్ రూ.3500!
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని పెద్దలు అన్నారు. కానీ ఆవు పాలకు మించిన డిమాండ్ ఇప్పుడు ఒంటె పాలకు ఉంది. ఆ డిమాండ్‌ను రూపాయల్లో లెక్కించాలంటే, లొట్టిపిట్ట(ఒంటె)ల క్షీరం లీటరు ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.3వేల వరకూ పలుకుతోంది. అమెరికాలో అయితే రూ.3500 వరకూ వెళ్తోంది. ఒంటె పాలతో పాటు పాల పౌడర్కూ మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. రాజస్థాన్‌లోని ఒంటెల యజమానులకు ఈ డిమాండ్ వరంగా మారింది.
బికనీర్, కచ్, సూరత్ ప్రాంతాల్లో పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు కూడా వెలిశాయి. అసలేంటి ఈ ఒంటె పాల విశిష్టత అంటే, వీటిలో సహజసిద్ధమైన ఇన్సులిన్ ఉందట. డయాబెటిస్ ఉన్న వారికి ఈ పాలు చాలా ఆరోగ్యకరమని కొన్ని జంతువులపై చేసిన పరీక్షల్లో తేలిందట. ఇదే కాక ఆటిజం, కీళ్లనొప్పుల పరిష్కారానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఉపకరిస్తాయని పరిశోధకులు అంటున్నారు. మిగిళిన పాలతో పోలిస్తే లాక్టోజ్ శాతం కూడా చాలా తక్కువగా ఉన్న కారణంగా, లాక్టోజ్ సహించని వారికి ఒంటెపాలు మంచి ప్రత్యామ్నాయమని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఒంటెపాలను సరాసరి తాగకూడదు. మానవ శరీరంలోకి వెళ్లకూడని అనే మలినాలు వీటిలో ఉంటాయట. ఈ పాలను శుద్ధి చేసిన తర్వాతే తాగడానికి వీలుగా తయారవుతాయి. వీటినే పాలపొడిగా మార్చి దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశీయంగా మాత్రం ఒంటె పాలకు అంత డిమాండ్ లేదు.













