కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం
కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా, యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2007లో ఒకసారి, 2008లో మరొసారి యడ్యూరప్ప సీఎంగా చేశారు. ఆయన ఇప్పటివరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప సర్కార్ 15 రోజుల్లో బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. బలనిరూపణ తరువాత కేబినేట్ ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలను సాధించి, అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీకి ఆ పార్టీ 8 స్థానాల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పటికీ, గవర్నర్ వజుభాయ్ వాలా మాత్రం మొదట యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు యాడ్యూరప్ప గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. సుప్రీంకోర్టులో సైతం యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి లైన్‌క్లియర్ అయింది. అయితే, యడ్యూరప్పకు మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి, గవర్నర్ ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి.













