మోడీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్లు
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే మోడీకి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. నార్త్‌లో బీజేపీకి తిరుగులేదని, వచ్చే ఎన్నికల్లో సౌత్‌లోనే పాగా వేసి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోన్న మోడీకి నార్త్‌లో సీన్లేదని ఉప ఎన్నికల్లో తేలిపోయింది. రెండు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. బీజేపీకి రాజస్థాన్, పశ్చిమబెంగాల్లో ఘోరమైన అవమానమే మిగిలింది. రాజస్థాన్‌లో అయితే ఏకంగా రెండు ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం.
రెండు లోక్ సభ స్థానాలు కూడా….
రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్‌లోని మండల్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ జయభేరి ఎగురవేసింది. బెంగాల్లో నవోపార, ఉల్లుబెరియా అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర వైఫల్యాన్ని ఎదురుచూడాల్సి వచ్చింది. అధికారంలో ఉండి కూడా రాజస్థాన్‌లో ఓటమి చవిచూసిన బీజేపీ, బెంగాల్లో కొంత మెరుగైంది. ఇక్కడ రెండు నియోజకవర్గాల్లోనూ కమ్యూనిస్టులను మూడో ప్లేస్‌లోకి నెట్టేసి బీజేపీ రెండో ప్లేస్‌లోకి వచ్చింది.
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు…
రాజస్థాన్‌లో బీజేపీ పరువు కాస్తా ఖల్లాస్ అయ్యింది. ఇక్కడ ఆ పార్టీ అధికారంలో ఉంది. ఈ యేడాది చివర్లో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలాంటి టైంలో బీజేపీ అక్కడ ఏకంగా మూడు సిట్టింగ్ స్థానాలు అందులోనూ రెండు ఎంపీ సీట్లు కోల్పోవడం మోడీకి మామూలు షాక్ కాదు. మరో ఏడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అసెంబ్లీ పోరుకు సెమీఫైనల్‌గా భావించి.. సీఎం వసంధరారాజే, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా వచ్చాయి.
సచిన్ పైలట్ సీటు తిరిగి కాంగ్రెస్ ఖాతాలోకే…
2014 సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్ సీటు నుంచి కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఈ సారి అజ్మీర్, అల్వార్ రెండు చోట్ల సిట్టింగ్ ఎంపీలు మృతిచెందడంతో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో సచిన్ పైలట్ తన అనుచరుడు అయిన రఘుశర్మను రంగంలోకి దింపారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ లంబాపై కాంగ్రెస్ అభ్యర్థి రఘు శర్మ భారీ మెజారిటీతో గెలుపొందారు.ఇక మరో ఎంపీ సీటు అయిన అల్వార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థి జస్వంత్‌సింగ్ యాదవ్‌పై విజయం సాధించారు. రాహుల్ గాంధీ కీలక అనుచరులుగా భావించే సచిన్ పైలట్, సీపీ జోషీ, జితేంద్రసింగ్ భన్వర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పార్టీ విజయానికి కృషి చేశారు. ఈ విజయంతో రాజస్థాన్ కాంగ్రెస్‌కు కొత్త జోష్ వచ్చింది. జైపూర్‌లో ఆ పార్టీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.













