కన్నడసీమలో కమల వికాసం
కర్ణాటకలో కమలం వికసించింది. పోటాపోటీగా సాగిన పోరులో అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దక్షిణాదిలో మోదీ ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించిందని చెప్పవచ్చు. ఈ ఏడాది చివరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ సమయంలో కర్ణాటక విజయోత్సాహంతో బీజేపీ ఆ ఎన్నికలకు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలో కమలవికాసానికి దోహదపడిన అంశాల్లో ప్రధాని మోదీ ప్రచారం ప్రధానంగా చెప్పవచ్చు.
ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు అమిత్‌షా రెండు సంవత్సరాల ముందుగానే ఎన్నికల వ్యూహాలకు పదునుబెట్టారు. పార్టీకి పట్టున్న కోస్తా ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న అనంత్‌కుమార్ హెగ్డేకు కేంద్రమంత్రి పదవి అప్పగించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సీఎం యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2013లో యడ్యూరప్ప స్థాపించిన పార్టీతో బీజేపీకి అనేక చోట్ల గండిపడింది. దీంతో ముందు జాగ్రత్తగా యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించారు. మోదీ కొంత ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినా పోలింగ్‌కు కొన్నిరోజుల ముందు పలు నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. తన వాక్చాతుర్యంతో కర్ణాటక ప్రజల మనసు గెలుచుకున్నారు. సిద్ధరామయ్య అవినీతిపై వారు చేసిన ప్రచారం విజయానికి దోహదమైందంటున్నారు.
కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలను సంధించారు. సిద్ధ రూపయాగా వర్ణించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలనను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో డబ్బు ఖర్చు పెడితే కానీ ఏ పనీ జరగడం లేదన్నారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించడం లేదని ఆరోపించారు. తాము అధికారంలో వస్తే స్వచ్ఛమైన పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. మోదీ చేసిన ప్రసంగాలకు ప్రజలు ఓట్ల రూపంలో ఆమోదం తెలిపారు.













