బిజెపి ఎన్నికల వ్యూహం పట్టు తప్పుతోందా?
భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహం పట్టు తప్పుతోంది. వరుసగా కొన్ని రాష్ట్రాల్లో మెజారిటీకి ఆమడదూరంలో పార్టీ నిలుస్తోంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్రం బిజెపి నుంచి చేజారింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మహారాష్ట్రల్లో వరుసగా బిజెపి అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల జయాపజయాలు ఎలా ఉన్నా కొన్ని చోట్ల తమ మిత్రపక్షాలకు కూడా బిజెపి దూరమైంది. మహరాష్ట్రలో రెండు దశాబ్ధాలుగా మైత్రిబంధం పెనవేసుకున్న శివసేనతో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బిజెపి దూరమైంది. అలాగే జార్ఖండ్ ఎన్నికల్లో ఇంతవరకు వెంటున్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ బిజెపినొదిలి ఈసారి సొంతంగా పోటీకి దిగింది. వచ్చే ఏడాది ఢిల్లి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లిలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు చోట్ల ఇదే ఫలితాలు పునరావతమైతే ప్రాంతీయ పార్టీల ధాటికి బిజెపి తట్టుకోలేక పోతోందన్న నిర్ధారణకు రాజకీయ వర్గాలొచ్చే అవకాశముంది.
2019సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి వరుసగా రెండోసారి ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ కూటమి ఎన్‌డిఎకే మాత్రం పోటీనివ్వలేక పోయింది. అలాగే వామపక్షాల నాయకత్వంలోని మూడో కూటమి కనీసం బలమైన అభ్యర్ధుల్ని కూడా బరిలో దించలేకపోయింది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించిన స్థానిక పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ 2019ఎన్నికల నాటికి ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ దశలో బిజెపిమిత్రపక్షాల్తో సంబంధంలేకుండా ఒంటరిగానే ప్రభుత్వాన్నేర్పాటు చేయగలిగే సంఖ్యాబలాన్ని లోక్‌సభలో సాధించింది. అప్పటి ఎన్నికల్లో చతికిల పడ్డ కాంగ్రెస్ తిరిగి కోలుకోలేదన్న ప్రచారానికి గురైంది.
సార్వత్రిక ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో బిజెపి ఒక్కటే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో ఉనికి సైతం ప్రదర్శించలేక పోయింది. ప్రాంతీయ పార్టీలకంటే అధ్వానమైన పనితీరును కనబర్చింది. దీంతో ఇకముందు బిజెపి మాత్రమే జాతీయ స్థాయిలో దేశం యావత్ అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో పోటీ చేయగలిగే సామర్ద్యాన్ని నిలబెట్టుకుంది. అయితే ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అసెంబ్లి ఎన్నికల్లో బిజెపి తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రతిచోట స్థానిక పార్టీల్నుంచి బలమైన పోటీనెదుర్కొంటోంది. అంతకుముందే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ అసెంబ్లిలో మేజిక్ ఫిగర్‌ను దక్కించుకోగలిగింది. మహరాష్ట్రలోనూ అధిక సీట్లు సాధించినా ఏ ఇతర పార్టీ కూడా బిజెపితో కలిసేందుకు ముందుకు రాలేదు. శివసేన సైతం బిజెపి ఆధిపత్యాన్ని అక్కడ అంగీకరించలేదు. దీంతో అంచెలంచెలుగా రాష్ట్రాల్లో బిజెపి ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోవడం మొదలైంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ నినదించిన బిజెపి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది.
కాగా ఇప్పటికే కొన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్రాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్దపడుతున్నాయి. ఎన్ఆర్సి చట్టానికి వ్యతిరేకంగా మమతాబెనర్జీ ఉద్యమం నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తేలేదంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ చట్టంపై ఇదే తరహా విధానాన్ని ప్రదర్శించారు. జార్ఖండ్ ఫలితాలు వెల్లడైన అనంతరం పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల వైఖరిలో స్పష్టమైన మార్పు గోచరిస్తోంది. ఇంతవరకు బిజెపికి ఎదురుచెప్పేందుకు సాహసించని నాయకులంతా ఇప్పుడు బిజెపిపై నిప్పులు కురిపిస్తున్నారు. ఎవరికి వారే తమ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే తమకు ముఖ్యమంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో 2024 ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు పొందిన సీట్ల అధికారంగానే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.













