ఆధార్ పై కేంద్రం సంచలన నిర్ణయం
ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలన్నా, సిమ్ కార్డు కొనాలన్నా ఇప్పటివరకు ఆధార్ తప్పనిసరి. రేషన్‌కార్డు, పాస్‌పోర్టు దరఖాస్తు చేయాలన్నా ఆధార్ అడిగేవారు. కానీ ఇకపై అలా కుదరదు. ఏ సంస్థ అయినా చిరునామా ధ్రువీకరణ, గుర్తింపు కోసం ఆధార్ అడిగితే రూ.కోటి జరిమానా విధించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. దీంతో పాటు మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అంతేకాదు మైనర్లుగా ఉన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకున్నవారు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆధార్ ఉండాలా వద్దా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెలీగ్రాఫ్, పీఎంఎల్ఏ చట్టాలను కేంద్రం సవరణలు చేసింది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆధార్ నమోదు సమయంలో సేకరించే వివరాలను దుర్వినియోగం చేస్తే రూ.50 లక్షల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.













