ప్రభుత్వ లాంఛనాలతో వాజ్ పేయీ అంత్యక్రియలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అటల్ దత్తపుత్రిక నమిత, వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భూటన్ రాజు వాంగ్‌చుక్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు అడ్వాణీ సహా పలువురు స్మృతి స్థల్లో మహానేతకు నివాళులర్పించారు.
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తదితరులు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు.













