ఆశారాం బాపుకు జీవిత ఖైదు
16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో స్వయం ప్రకటిత భగవాన్ ఆశారాం బాపును దోషిగా తేల్చుతూ జోథ్‌పూర్ ఎస్సి, ఎస్టి కోర్టు తీరునిచ్చింది. నేడు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఆయన 56 నెలల నుంచి జోథ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ఇదే కేసులో దోషులుగా తేలిన ఆయన అనుచరులు శరద్, శిల్పిలకు చెరో 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. మణి గ్రామంలో ఉన్న ఆశ్రమంలో బాపు 16 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు రావడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన 2013 ఆగస్టు 31న అరెస్టు అయ్యారు. యుపిలోని షాజహాన్‌పూర్‌కు చెందిన బాధిత యువతి చికిత్స కోసం ఆశ్రయానికి వెళ్లినప్పుడు, ఆమెపై ఈ అత్యాచారం జరిగింది. కోర్టు తీర్పు నేపథ్యంలో జోథ్పూర్తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ఈ నెల 30 వరకు 144 సెక్షన్ విధించారు.













