జ్యోతి సురేఖకు ప్రధాని అభినందన
ఆర్చరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ భారతదేశానికి అనేక పతాకాలు తెచ్చిపెట్టిన క్రీడాకారిణి జ్యోతి సురేఖ (21) పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న ఎంపీ గోకరాజు గంగరాజు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు ఆమెను వెంటబెట్టుకుని ప్రధానిని కలిశారు. ఆర్చరీలో అమె సాధించిన విజయాలు, పతకాల గురించి ప్రధానికి వివరించి చెప్పారు. ఈ ఏడాది అర్జున అవార్డు కోసం ఆమె పేరును నామినేట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ చిన్నతనం నుంచే అద్భుత విన్యాసాలు చేసి పలువురిని ఆకట్టుకుంది. అందుకే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున తాము ప్రోత్సహించామని ఎంపీ గంగరాజు తెలిపారు. అమెరికా పంపించి మరీ శిక్షణ ఇప్పించినట్టు ఆయన వెల్లడించారు. అనంతరం జ్యోతి సురేఖ మాట్లాడుతూ, ప్రధానిని కలవడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు సాధించిన వాటి కంటే తాను భవిష్యత్తులో మరింత అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.













