వైభవంగా విరుష్క వివాహ విందు
ఈ నెల 11న ఒకింటి వారైన కోహ్లీ, అనుష్కల వివాహ విందు ఢిల్లీలోని తాజ్ డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ దర్బార్ హాల్లో అంగరంగవైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ విందుకు హాజరై విరుష్క జంటను ఆశీర్వదించారు. ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన ఎరుపు, బంగారు వర్ణం కలబోసిన బెనారస్ పట్టు చీరెలో మెడ నిండుగా వజ్రాల నక్లెస్‌తో అనుష్క మెరిసిపోగా, తెలుపు రంగు సిల్క్ కుర్తాపై నలుపు బంద్గాలతోపాటు కాఫీ కలర్ కశ్మీర్ ఉలెన్ షాల్‌తో కోహ్లీ మరింత అందంగా కనిపించాడు. విందు ప్రారంభానికి ముందు వేదిక వెలుపల విరుష్క జోడీ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా కోహ్లీ కుడి బొటన వేలితో డన్ అనే రీతిలో సంజ్ఞ చేయగా అనుష్క శిరస్సు వంచి నమస్కరిస్తూ ముసిముసి నవ్వులు చిందించింది. ఇక వీరి రెండో రిసెప్షన్ ఈనెల 26న ముంబైలో జరగనుంది.













