అమిత్ షా వ్యూహం ఎందుకు అడ్డం తిరిగిందంటే?
అపర చాణక్యుడి అమిత్ షా వ్యూహం అడ్డం తిరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి ఎత్తు సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పారలేదు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని గత కొంతకాలంగా హోరెత్తిస్తున్న ఈ గుజరాత్ నాయకుడు తొలిసారి ఎగువ సభకు ఎన్నికైనా ఆయనలో ఆ సంతోషం కనపడటం లేదు. తన చిరకాల ప్రత్యర్థి అహ్మద్ పటేల్ ను అడ్డుకునే ప్రయత్నం విజయవంతం కాకపోవడం ఇదుకు కారణం. అహ్మద్ పటేల్ ను మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనీయకుండా చేసిన ప్రయత్నాలు విఫలం కావడం జీర్ణించుకోలేని పరిణామం. రాజకీయ కారణాలే కాకుండా వ్యక్తిగత వైరుథ్యాలు కూడా ఈ ఎన్నికల్లో పనిచేశాయి. ఎట్టకేలకు అహ్మద్ పటేల్ విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణులకు అపరిమిత సంతోషాన్నిచ్చింది. అదే సమయంలో అహ్మద్ పటేల్ ను అడ్డుకోలేకపోయామన్న బాధ భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మరీ ముఖ్యంగా గుజరాత్ పార్టీ వర్గాల్లో నెలకొంది.
బలమున్నా…బలహీనపర్చాలని……
గుజరాత్ లో పార్టీ బలాబలాను పరిశీలిస్తే ఇద్దరు బీజేపీ, ఒక కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సులభతరం. 176 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో బీజేపీకి 121 మంది, కాంగ్రెస్ 51 మంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు, జనతాదళ్ (యునైటెడ్) కు ఒకరు, ఒక స్వతంత్ర శాసనసభ్యుడు ఉన్నారు. పటేల్ గెలుపునకు 45 ఓట్లు అవసరం. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ తరుపున అహ్మద్ పటేల్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బల్వంత్ సింగ్ రాజ్ పుట్‌ను నాల్గో అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ చీలికలు, తమ దగ్గర గల మిగులు ఓట్లతో మూడో అభ్యర్థిని గెలిపించుకోవచ్చన్నది బీజేపీ వ్యూహం. అన్నింటికీ మించి కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అహ్మద్ పటేల్ ను దెబ్బతీయాలన్నది అసలు లక్ష్యం. ఈ స్కెచ్ బాగానే ఉన్నప్పటికీ అమలులో విఫలమైంది కాషాయ పార్టీ. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను తమ వలలోకి లాగింది. ఒకప్పటి బీజేపీ నేత, నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ కు పెద్ద దిక్కయిన శంకర్ సింగ్ వాఘేలా కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో బీజేపీ సంబరాలు చేసుకుంది. కాని గుజరాత్ కాంగ్రెస్ కూడా గట్టి వ్యూహరచనే చేసింది. శాసనసభ్యులు ఎక్కడ చేజారిపోతారన్న భయంతో తాము అధికారంలో ఉన్న కర్ణాటకకు తరలించింది. వారికి ఆశ్రయమిచ్చిన కర్ణాటక మంత్రి డి.కె. శివకుమార్ పై ఐటీ దాడులు చేసినప్పటికీ లెక్క చేయలేదు. ఎమ్మెల్యేలను కాపాడుకుంది. చివరికి పోలింగ్ తేదీ నాటికి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చింది. బీజేపీని చివరికి బోల్తా కొట్టించింది.
ఇద్దరి ఎమ్మెల్యేల అత్యుత్సాహం వల్లనే……
రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవన్న నానుడి ఇప్పుడు మరోసారి రుజువైంది. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించినా అహ్మద్ పటేల్ ఓటమి ఖాయమన్న ధీమాలో బీజేపీ ఉంది. ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పై బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. నిజానికి ఈ వ్యూహం ఫలించేదే. కాని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అత్యుత్సాహం బీజేపీ కొంపముంచింది. అమిత్ షా పట్ల అత్యంత విధేయత కనబర్చే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాఘవ సటూలక. భోలా గోపిల్ బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. బ్యాలెట్ పత్రాలను పార్టీ అధికార ప్రతినిధులకు కాకుండా ఇతర ఏజెంట్లకు చూపి పప్పులో కాలేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ వెను వెంటనే స్పందించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. క్రాస్ ఓటింగ్ కు స్పష్టమైన ఆధారులున్నాయని వాటిని తారుమారు చేస్తే సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది. క్రాస్ ఓటింగ్ కు సంబంధించి వీడియో ఫుటేజీని ఎన్నికల సంఘానికి అందజేసింది. దీంతో బంతి ఎన్నికల సంఘం కోర్టుకు చేరింది. ఒక్కసారిగా కాంగ్రెస్, బీజేపీ నేతలు అప్రమత్తమై ఈసీని కలిశారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ ఈసీని మూడు సార్లు కలిసి తమ వాదనను విన్పించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగాని, పరిశీలకులు గాని అభ్యంతరం వ్కక్తం చేయలేదని, ఒకసారి ఓట్లు బ్యాలెట్ బాక్స్ లో పడ్డాక వాటి చెల్లుబాటును ప్రశ్నించరాదని పకడ్బందీగానే తన వాదనను విన్పించింది. బీజేపీ బృందం బయటకు రాగానే కాంగ్రెస్ దిగ్గజం చిందబరం నేతృత్వంలోని బృందం ఈసీని కలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా ఆ ఇద్దరి ఓట్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈసీ తర్జనభర్జనలు పడింది. చివరకు ఈసీ ఆ రెండు ఓట్లను రద్దు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేుకున్నాయి. అధికారికంగా ఫలితాలు ప్రకటించకముందే విజయం తమదేనన్న ధీమా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ప్రస్పుటంగా కన్పించింది. అదే సమయంలో బీజేపీ శిబిరంలో నైరాశ్యం ఆవరించింది.
వ్యక్తిగత విభేదాల వల్లనేనా?
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరాటంగా కన్పించలేదు. అమిత్ షా, అహ్మద్ పటేల్ మధ్య వ్యక్తిగత పోరుగానే కనిపించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా పార్టీలో చక్రంతిప్పుతున్న అహ్మద్ పటేల్ ను ఓడిస్తే పార్టీలో ఆయన ప్రభావం శూన్యమవుతుందని బీజేపీ అంచనా వేసింది. అదేవిధంగా కొద్దిరోజుల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగవుతుందని భావించింది. వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే అహ్మద్ పటేల్ వంటి దిగ్గజాన్ని పరోక్ష ఎన్నికల్లో ఓడించడం ముఖ్యమని కమలనాధులు భావించారు. పదేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ అహ్మద్ పటేల్ ప్రోద్బలంతోనే అప్పట్లో తమపై కేసులు పెట్టించిందన్న భావన బీజేపీలో ఉంది. దానికి ప్రతీకారంగానే ఈ వ్యూహం పన్నింది. వ్యక్తిగత వైరుద్థ్యాలు, సిద్ధాంత పోరాటాలు ఎలా ఉన్నప్పటికీ ఎగువ సభను ఎన్నికల్లో బీజేపీ హుందాతనంగా వ్యవహరించలేదన్నది వాస్తవం.













